సర్పంచులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలి ఎంపీటీసీలతో సమానంగా అవకాశం ఇవ్వాలి.. చట్ట సవరణలు చేపట్టాలి తెలంగాణ సర్పంచులంతా ఐక్యంగా పోరాడాలి: భాస్కర్ గౌడ్
తెలంగాణ ప్రజాగర్జన. షాద్ నగర్ గ్రామ పంచాయతీ ప్రథమ పౌరులుగా గ్రామీణ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సర్పంచులకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని నిడుదవెల్లి గ్రామ సర్పంచ్ చెదురువెళ్లి భాస్కర్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. గ్రామస్థాయిలో ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, అభివృద్ధి కార్యక్రమాల అమలులో కీలకంగా వ్యవహరించే సర్పంచులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు లేకపోవడం ప్రజాస్వామ్య భాగస్వామ్యంలో లోటుగా ఉందన్నారు. ఎంపీటీసీలకు ఉన్నట్లుగానే సర్పంచులకు కూడా ఓటు హక్కు కల్పించేలా సంబంధిత చట్టాల్లో అవసరమైన సవరణలు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించేలా రాష్ట్రంలోని సర్పంచులందరూ పార్టీలకతీతంగా ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్వరాజ్యం బలోపేతం కావాలంటే సర్పంచులకు సముచిత గౌరవంతోపాటు తగిన అధికారాలు, హక్కులు కల్పించాలని భాస్కర్ గౌడ్ పేర్కొన్నారు.