🏠 telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 01 November 2026, 8:19 am Posted by : TELANGANA PRAJA GARJANA

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పేదల ప్రాణాలతో చెలగాటమా? గర్భిణీ మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: సర్పంచ్‌ అనూష రవీందర్‌రెడ్డి

News Image
కొండుర్గు, నవంబర్‌ 1 (తెలంగాణ ప్రజాగర్జన): షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీ మహిళ మృతి చెందిన ఘటనపై మహాదేవ్‌పూర్‌ గ్రామ సర్పంచ్‌ అనూష రవీందర్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వ ఆస్పత్రులే ప్రాణాలకు ముప్పుగా మారడం బాధాకరమని అన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యం వహించినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేని పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులే ప్రధాన ఆధారమని పేర్కొన్నారు. అలాంటి చోట్ల వైద్య సేవల్లో నిర్లక్ష్యంపై ఆరోపణలు రావడం ఆందోళనకరమన్నారు. గర్భిణీ మహిళకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించారా? అవసరమైన చికిత్స అందించారా? అత్యవసర వైద్యంలో జాప్యం జరిగిందా? అనే అంశాలపై ఉన్నతాధికారులతో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు.విచారణలో వైద్యులు లేదా సిబ్బంది నిర్లక్ష్యం నిర్ధారణ అయితే ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని విధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించి, అన్ని విధాలా అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పనితీరును నిరంతరం పర్యవేక్షించాలని, అత్యవసర వైద్య సేవలు, అవసరమైన మందులు, సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందకపోయినా, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రాణాలకు భరోసా ఉండాలని అనూష రవీందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఘటనపై వాస్తవాలను వెలుగులోకి తెచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
🏠 Home