🏠 telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 29 October 2026, 2:24 pm Posted by : TELANGANA PRAJA GARJANA

ఆరు నెలలుగా ముగ్గురు అధ్యాపకుల్లేరు. ఉత్తీర్ణత సాధించేది ఎలా.?

News Image
ఆరు నెలలుగా 3 అధ్యాపకుల్లేరు. ఉత్తీర్ణత సాధించేది ఎలా.?
షాద్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో AEDP విద్యార్థుల ఆవేదన
మూడు సబ్జెక్టులకు బోధకుల కొరత.. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ ఆగ్రహం

ప్రభుత్వ కళాశాలలో చేరి ఉన్నత విద్య అభ్యసించాలనే పేద విద్యార్థుల ఆశలకు అధ్యాపకుల కొరత అడ్డంకిగా మారుతోంది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫార్మాస్యూటికల్స్ మాన్యుఫాక్చరింగ్ అండ్ క్వాలిటీ (AEDP) కోర్సు చదువుతున్న విద్యార్థులు బోధకులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోర్సు ప్రారంభమైనప్పటి నుంచి సుమారు ఆరు నెలలు గడుస్తున్నా కీలక సబ్జెక్టులకు అధ్యాపకులను నియమించలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 11 నుంచి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కానుండగా, బోధన లేకుండా ఉత్తీర్ణత ఎలా సాధించాలని ప్రశ్నిస్తున్నారు.

*3 అధ్యాపకులు లేక.. చదువు ముందుకు సాగేది ఎలా?*

షాద్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ ఏడాది కొత్తగా ప్రారంభించిన AEDP కోర్సులో 15 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే, ఈ కోర్సుకు సంబంధించి GMP, EHS, PP సబ్జెక్టులకు అధ్యాపకులు అందుబాటులో లేరని విద్యార్థులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లిష్, కెమిస్ట్రీ సబ్జెక్టులకు మాత్రమే బోధన కొనసాగుతోందని, మిగతా సబ్జెక్టులపై సరైన అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు.కోర్సులో చేరినప్పటి నుంచే అధ్యాపకుల కొరత ఉందని, ఈ సమస్యను పలుమార్లు కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లామని విద్యార్థులు తెలిపారు. సంబంధిత ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు.

రూ.12,700 ఫీజు చెల్లించి.. బోధన కోసం ఎదురుచూపులు

ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్ కోసం రూ.12,700 ఫీజు చెల్లించాలని సూచించారని విద్యార్థులు తెలిపారు. నిబంధనల ప్రకారం ఫీజులు చెల్లిస్తూ చదువుకుంటున్న తమకు అవసరమైన బోధన అందించకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు ప్రైవేటు కళాశాలల్లో చదివే ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరుతున్నారని, ఇక్కడ కూడా అధ్యాపకులు లేకపోతే తమ భవిష్యత్తు ఏమవుతుందని ప్రశ్నిస్తున్నారు.

పరీక్షలు సమీపిస్తున్నా స్పందనేది?

నవంబర్ 11 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది. కీలక సబ్జెక్టులకు బోధన లేకపోవడంతో పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో అర్థం కావడం లేదని చెబుతున్నారు. సిలబస్‌పై పూర్తిస్థాయి అవగాహన లేకుండా పరీక్షలు రాస్తే ఫలితాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు వెంటనే గెస్ట్ ఫ్యాకల్టీని నియమించి బోధన ప్రారంభించాలని, పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తగిన సమయం కల్పించేలా సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని కోరుతున్నారు.

పేద విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా.?..ఏఐఎస్ఎఫ్ ఆకాష్ నాయక్

విద్యార్థుల సమస్యను ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు ఆకాష్ నాయక్ వారితో కలిసి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు నెలలుగా అధ్యాపకుల కొరత కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. పరీక్షలు సమీపిస్తున్న సమయంలోనైనా స్పందించి అవసరమైన అధ్యాపకులను నియమించాలని డిమాండ్ చేశారు.ఒకవైపు కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా విద్యాబోధన అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతుండగా, మరోవైపు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు పూర్తిస్థాయిలో బోధన అందకపోవడం బాధాకరమన్నారు. విద్యార్థులు మొదటి నుంచే సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం చూపకపోవడం సమంజసం కాదని పేర్కొన్నారు.విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. GMP, EHS, PP సబ్జెక్టులకు తక్షణమే గెస్ట్ ఫ్యాకల్టీని నియమించాలని, విద్యార్థులకు పూర్తిస్థాయి బోధన అందించాలని కోరారు.స్థానిక ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ ప్రభుత్వ పాఠశాలలకు పెద్దపీట వేస్తూ సొంత నిధులతో ప్రభుత్వ పాఠశాలకు ఎనలేని సేవలు అందిస్తున్న దాఖలాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మాత్రం సమస్యలు తీష్ట వేశాయని ఆకాష్ నాయక్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే శంకరన్న ఈ సమస్యను ప్రత్యేక చొరవ చూపి పరిష్కార మార్గం చూపాలని కోరారు. స్థానికంగా ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల తరహాలోనే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నెలకొన్న సమస్యను కూడా పరిష్కరించాలని కోరారు.అధ్యాపకుల కొరత కారణంగా విద్యార్థులు నష్టపోకుండా సంబంధిత ఉన్నతాధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని, పరీక్షల వాయిదా అంశాన్ని పరిశీలించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ కళాశాలలో అడ్మిషన్లు కల్పించడం మాత్రమే కాకుండా, విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడం కూడా ముఖ్యమేనని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అధ్యాపకులను నియమిస్తారా? విద్యార్థుల అభ్యర్థన మేరకు పరీక్షలను వాయిదా వేస్తారా? అనేది వేచి చూడాలి.
🏠 Home