🏠 telanganaprajagarjana.com
Watermark
Clip Header Logo
Date of Publish : 28 October 2026, 10:20 am Posted by : TELANGANA PRAJA GARJANA

పారిశుద్ధ్య కార్మికులకు పండగ కానుక.. మార్వాడీ సమాజ్‌ ఔదార్యం

News Image
సేవా స్ఫూర్తికి పండగ వేళ గౌరవం
210 మంది మున్సిపల్ కార్మికులకు నూతన వస్త్రాల పంపిణీ
30 మంది దాతల సహకారంతో కార్యక్రమం
సేవా భావంతో ఇతరులకు మేలు చేయాలి: ఏసీపీ లక్ష్మీనారాయణ
షాద్‌నగర్ పట్టణ పరిశుభ్రత కోసం నిత్యం శ్రమించే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు రాజస్థానీ మార్వాడీ సమాజ్ పండగ కానుక అందించింది. దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని మంగళవారం షాద్‌నగర్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో 210 మంది కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఇందులో 110 మంది మహిళా కార్మికులు, 100 మంది పురుష కార్మికులు ఉన్నారు.
సంఘం నిర్వాహకులు రాధ్యే శ్యామ్ గౌర్, భావన్లాల్ చౌదరి, కైలాష్ చౌదరి, రాజు కుమావత్ తదితరుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఏసీపీ లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్, సీఐ సీతారాం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... సేవా భావంతో చేసే కార్యక్రమాలు ఇతరులకు మేలు చేస్తాయని అన్నారు. నిత్యం ప్రజలకు సేవలందించే పారిశుద్ధ్య కార్మికులను పండగ వేళ గుర్తించి గౌరవించడం అభినందనీయమని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ బసవేశ్వర్ మాట్లాడుతూ... పట్టణ పరిశుభ్రతలో కీలక పాత్ర పోషించే కార్మికులను గౌరవించడం సమాజ బాధ్యత అని అన్నారు. మార్వాడీ సమాజ్ చేపట్టిన కార్యక్రమం స్ఫూర్తిదాయకమని కొనియాడారు.ఈ కార్యక్రమ నిర్వహణకు రాజస్థానీ మార్వాడీ సమాజ్‌కు చెందిన 30 మంది దాతలు ఒక్కొక్కరు రూ.6 వేల చొప్పున విరాళాలు అందించారు. దీంతో మొత్తం రూ.1.80 లక్షలు సమకూరినట్లు నిర్వాహకులు తెలిపారు. దాతల సహకారంతో 210 మంది కార్మికులకు పండగ కానుకలు అందించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పెంటయ్య, రాజు నాయక్, గోపాల్, అశోక్, సంఘం పెద్దలు కమల్ కిషోర్ శర్మ, గజేందర్ గౌర్, ప్రేమ్ కుమావత్, మహేందర్ కుమావత్ తదితరులు, ఇతర సంఘ సభ్యులు, దాతలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home