జాతీయ బాక్సింగ్‌లో కొందుర్గు అమ్మాయి పంచ్! అండర్–17 జాతీయ పోటీల్లో భవ్య తేజకు రజత పతకం షాద్‌నగర్ నియోజకవర్గానికి గర్వకారణంగా నిలిచిన యువ బాక్సర్
తెలంగాణ ప్రజాగర్జన.| కొందుర్గు, అక్టోబర్ 27: హైదరాబాద్‌లోని ఉప్పల్ బాక్సింగ్ స్టేడియంలో నిర్వహించిన అండర్–17 జాతీయ బాక్సింగ్ పోటీల్లో కొందుర్గు గ్రామానికి చెందిన జి. భవ్య తేజ అద్భుత ప్రతిభ కనబరిచి రజత పతకం సాధించారు. జిల్లెల్ల జంగయ్య కుమార్తె అయిన భవ్య తేజ జాతీయ స్థాయిలో రజత పతకాన్ని కైవసం చేసుకుని కొందుర్గు గ్రామంతో పాటు షాద్‌నగర్ నియోజకవర్గానికి కీర్తిప్రతిష్ఠలు తెచ్చారు. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన క్రీడాకారులు పాల్గొన్న పోటీల్లో తన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి ఈ ఘనత సాధించడం విశేషం. కఠోర సాధన, పట్టుదల, క్రమశిక్షణతో జాతీయ స్థాయిలో రాణించిన భవ్య తేజ విజయంపై గ్రామస్థులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక గ్రామం నుంచి జాతీయ క్రీడా వేదికపై పతకం సాధించడం గర్వకారణమని, ఆమె విజయం ఎంతోమంది యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ భవ్య తేజకు గ్రామస్థులు, శ్రేయోభిలాషులు అభినందనలు తెలియజేశారు.